Advertisement

రాష్ట్రంలో నీటి కొరతపై ఇరిగేషన్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు

మన పత్రిక: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల తీవ్ర నీటి కొరత తలెత్తిన నేపథ్యంలో జలవనరుల శాఖలోని అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల ప్రయోజనాలను రక్షించాలని ఆయన ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో నిర్వహించిన ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున El Nino ప్రభావంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థల ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 55 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉన్తనందున, ఆ నీటిని తాగునీటి అవసరాలకు మరియు ఆరుతడి పంటలకే వినియోగించాలని మంత్రి సూచించారు. గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం సీలేరు జలాలను వాడుతున్నామని, మెరక ప్రాంత రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పొలవరం కుడి కాలువ నీరు వృథా కాకుండా కృష్ణా డెల్టాకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement

నాగార్జున సాగర్ నిండకుండానే కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుత సీజన్‌లో సాగర్‌కు నీరు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే భద్రపరచాలని ఆదేశించారు. ఈ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement