Advertisement

2026 నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా? పరిశోధనలో అసలు నిజాలివే

2026 నవంబర్ 13న ప్రపంచం అంతమైపోతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 66 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెప్పారంటూ వస్తున్న వార్తలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ దావాకు ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని వివరాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికన్ జర్నల్ ‘సైన్స్’ 1960 నవంబర్ 4న ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. ఫిజిసిస్ట్ హైంజ్ వాన్ ఫోయెర్స్టర్, పరిశోధకులు పాట్రిషియా మోరా, లారెన్స్ అమియోట్ కలిసి ఈ పత్రాన్ని అందించారు. ప్రపంచ జనాభా ఏ విధంగా పెరుగుతుందో వివరించడానికి వారు ‘హైపర్‌బోలిక్ గ్రోత్’ అనే గణిత నమూనాను ఉపయోగించారు. జనాభా పెరుగుదల ఇదే రీతిలో కొనసాగితే 2026 నవంబర్ 13 నాటికి ఆ సంఖ్య అనంత స్థాయికి చేరుతుందని అందులో పేర్కొన్నారు. వారు వాడిన డూమ్స్‌డే అనే పదాన్ని కొందరు భూమి అంతం కాబోతోందని పొరపాటుగా అర్ధం చేసుకున్నారు.

Advertisement

జనాభా అంచనాలు మరియు స్పష్టత

ఈ అధ్యయనం జనాభా పెరుగుదల వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను వివరించడానికి ఉద్దేశించిన గణిత లెక్క మాత్రమే తప్ప, గ్రహం నాశనమవుతుందని చెప్పలేదు. అంతరిక్షం నుంచి గ్రహశకలాలు ఢీకొట్టడం లేదా సూర్యుడు పేలిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయని ఆ రోజు శాస్త్రవేత్తలు ప్రతిపాదించలేదు. జనాభా పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి 2024 నివేదిక ప్రకారం, 2024లో 8.2 బిలియన్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080ల నాటికి 10.3 బిలియన్లకు చేరుకుని, 2100 నాటికి 10.2 బిలియన్లకు తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సూర్యుని నుంచి వచ్చే సౌర తుఫానులు విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం చూపినప్పటికీ, వాటి వల్ల భూమి నశించిపోదని స్పష్టమవుతోంది. 2026 నవంబర్ 13న భూమికి ప్రమాదం కలిగించే ఖగోళ సంఘటనలేవీ లేవని ఖగోళ శాస్త్రవేత్త ఇమాద్ ముజాహిద్ స్పష్టం చేశారు. కాబట్టి 2026లో ప్రపంచం అంతమవుతుందన్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టమవుతోంది.

Advertisement