Advertisement

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు ఏపీలో 49కి చేరిన బాధితులు

మన పత్రిక, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ తిరుపతి అర్బన్ ప్రాంతంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదయింది. 65 ఏళ్ల వృద్ధురాలు గత కొన్ని రోజులుగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. జూలై 23న నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే సదరు బాధితురాలి కుటుంబ సభ్యులను పరీక్షించగా వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కూడా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. శనివారం ఒక్కరోజే ఏపీలో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు రాగా… కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది.

Advertisement

ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా, కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

Advertisement