Advertisement

జాతీయ పురస్కారాల వేడుకలో ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ సందడి

మన పత్రిక: జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఘనవిజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు రాధా దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, కొత్త నటీనటులతో రూపొందినా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును పొందింది. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ, నిర్మాతలు ఫణి అడపాక, మన్యం రమేష్‌తో పాటు రచయితలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు ఈ కథను ఎంతో జాగ్రత్తగా మలిచిన దర్శకుడు యదు వంశీని, ఈ ప్రయాణంలో భాగస్వాములను చేసిన నిహారికను అభినందించారు. రచయితలు కొండల్ రావు, సుభాష్ తమ తొలి సినిమాకే నేషనల్ అవార్డు రావడం పట్ల గర్వం వ్యక్తం చేయగా, సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్ రాజ్ ఎడ్రోలు తమ కెరీర్‌లో ఈ విజయం ఒక మలుపు అని పేర్కొన్నారు. నటీనటులు రిషిక, తేజస్విని, సందీప్ సరోజ్, శ్యామ్ కళ్యాణ్, త్రినాథ్ వర్మ తదితరులు మాట్లాడుతూ, ఈ సినిమా తమకు గుర్తింపునిచ్చిందని, తమ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమని భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ, మద్దతునిచ్చిన ప్రేక్షకులకు మరియు మీడియాకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
Advertisement