మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని గాలికి వదిలేస్తున్న వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవసరమైతే వారి జీతాల్లో కోత విధించి, ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రులకే అందేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
జీతంలో 15 శాతం కట్! బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాక.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి సుమారు 15 శాతం వరకు కోత విధిస్తామని ప్రకటించారు.
- ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా సంబంధిత చట్టాలను సవరిస్తామని తెలిపారు.
- “తల్లిదండ్రులనే చూడని వారికి సమాజం పట్ల బాధ్యత ఎలా ఉంటుంది?” అని సీఎం ప్రశ్నించారు.
వృద్ధుల కోసం ‘ప్రణామ్’ పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వినూత్నంగా ‘బాల భరోసా’, ‘ప్రణామ్ డే కేర్’ సెంటర్లను సీఎం ప్రారంభించారు. ఒక్కొక్కటి రూ.1 కోటి వ్యయంతో 37 ప్రదేశాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్లకు నాణ్యమైన ఆహారం, తోటివారితో గడిపే వెసులుబాటు ఉంటుంది.
కీలక వరాలు..
- ట్రాన్స్జెండర్లకు: మునిసిపల్ సంస్థల్లో ట్రాన్స్జెండర్లను ‘కో-ఆప్షన్’ సభ్యులుగా నామినేట్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. అలాగే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.
- దివ్యాంగులకు: రూ.50 కోట్ల విలువైన పరికరాలను పంపిణీ చేశారు. దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
