మన పత్రిక: విద్యాశాఖలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉపాధ్యాయుల సమస్యలన్నీ తానే స్వయంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఆయన మాట్లాడారు. ప్రమోషన్లు, బదిలీలు, వ్యక్తిగత సమస్యల గురించి ఉపాధ్యాయులు భయపడాల్సిన పనిలేదని, ఆ బాధ్యత పూర్తిగా తనదేనని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
గతంలో లేని విధంగా కేవలం 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని సీఎం గుర్తుచేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ దేశాలు తెలంగాణ విద్యాశాఖ వైపు చూసేలా ఒక పంచవర్ష ప్రణాళికతో ఉపాధ్యాయ సంఘాలు ముందుకు సాగాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి ‘ఆఫ్ డే’ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు. జనవరి 2024 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడం సులభమేమో కానీ, ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అంత సులభం కాదని పేర్కొన్నారు.
విద్యాశాఖపై విమర్శలకు సమాధానం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయని, ఇది ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమేనని సీఎం అన్నారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరని, తాను ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం తీసుకురావడం, 30 వేల మందికి బదిలీలు ఇవ్వడం, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం వంటి చర్యలు చేపట్టినందుకు తాను ఎందుకు తప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వంలో తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కేవలం అధికారం కోసం కాదని, మానవతా దృక్పథంతో కూడుకున్నదని రేవంత్ రెడ్డి వివరించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
