హారర్ సినిమా తీసే ఆలోచనలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్

మన పత్రిక: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ భవిష్యత్తులో హారర్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. తన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’లో కొన్ని భయంకరమైన అంశాలు ఉండటంతో, హారర్ జానర్‌పై తన ఆసక్తి మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ది హాలీవుడ్ రిపోర్టర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, ఇకపై ప్రేక్షకులు తనను హారర్ సినిమా చేయమని అడగాల్సిన అవసరం లేదని, తన తాజా చిత్రాన్ని చూస్తే సరిపోతుందని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.

అయితే, హారర్ సినిమా తీయడం అనేది కేవలం సాంకేతిక మార్పులు లేదా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి ఉండదని నోలన్ స్పష్టం చేశారు. ఒక బలమైన కథాంశం లేదా అద్భుతమైన ఆలోచన ఉంటేనే ఈ జానర్‌ను ఎంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రయాన్ డి పాల్మా తీసిన ‘అబ్సెషన్’ సినిమాలోని కథా కథన శైలిని ఆయన ప్రశంసించారు. ఇక హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు కావ్యం ఆధారంగా రూపొందిన ‘ది ఒడిస్సీ’లో మ్యాట్ డామన్ ప్రధాన పాత్ర పోషించగా, అన్నే హాత్వే, టామ్ హాలండ్, జెండయా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కేవలం యాక్షన్, పురాణ అంశాలకే పరిమితం కాకుండా, పరస్పర గౌరవం అనే విలువలను కూడా చర్చిస్తుందని నోలన్ వివరించారు.