మన పత్రిక, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను తన ప్రియుడితో కలిసి భార్య అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. తమిళనాడుకు చెందిన రమేష్, కుప్పం ప్రాంతానికి చెందిన హాసినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది.
ఆలయ దర్శనానికి వెళ్తూ..
మంగళవారం రమేష్, హాసిని దంపతులు తమ చిన్నారితో కలిసి బైక్‌పై మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. రాత్రి కావస్తున్నా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
అడవిలో బయటపడిన మృతదేహం
సీసీటీవీ దృశ్యాలలో హాసిని తన భర్తతో కాకుండా, మరో ఇద్దరు యువకులతో కలిసి భర్త బైక్‌పైనే వెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఘాట్‌రోడ్డు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రమేష్ రక్తసిక్తమైన మృతదేహం లభించింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే హాసిని తన ప్రియుడు మరియు మరొకరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలు హాసినితో పాటు సహకరించిన అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
