Advertisement

సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం

మన పత్రిక: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నూతన సీజన్‌ను 2026 సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ షో స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుండగా, జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈసారి “దసరావతారం” అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో షోను తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను కూడా విడుదల చేశారు. కాగా, పోటీదారుల అధికారిక జాబితాను నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. అయితే పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దేవజాని మోదక్, ముకేష్ గౌడ, ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, వర్షిణి, పల్లవి గౌడ, తేజస్విని గౌడ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ నిర్వాహకుల నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

Advertisement

గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు అవకాశం కల్పించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం “బిగ్ బాస్ అగ్నిపరీక్ష” సీజన్ 2 నిర్వహించి పోటీదారులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో దాదాపు 70 మంది పాల్గొనగా, 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు ఆరుగురికి ప్రధాన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లభించే వీలుండగా, ఒకరిద్దరు వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించవచ్చని ప్రచారం జరుగుతోంది.

Advertisement