Advertisement

బిగ్ బాస్ 10 రెండో వారం నామినేషన్స్

మన పత్రిక: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారంలోకి ప్రవేశించడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు ఎదుర్కొన్న మొదటి నామినేషన్ టాస్క్ ఇది. ఈ ప్రక్రియ కోసం నిర్వాహకులు ఒక ప్రత్యేకమైన టాస్క్‌ను ఏర్పాటు చేశారు. తాడు చుట్టి ఉన్న ఒక పెద్ద పెగ్‌ను ఇద్దరు కంటెస్టెంట్లు పోటీపడి విప్పాల్సి ఉంటుంది. ఎవరైతే మొదటగా ఆ తాడును తొలగిస్తారో, వారికి తోటి హౌస్‌మేట్‌ను నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది.

ఈ టాస్క్‌లో మొదటగా సుధీర్ విజయం సాధించి త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. ఆట సరిగ్గా ముందుకు సాగకముందే చైత్ర పేరును మధ్యలోకి తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తనకు కేటాయించిన బాత్రూమ్ క్లీనింగ్ పనిని పూర్తి చేయకుండా అవకాశాన్ని వృధా చేసుకుందనే కారణంతో శాలినిని కూడా సుధీర్ నామినేట్ చేశాడు. మరోవైపు దేబ్జాని కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేసింది.

Advertisement

రోహిత్ సైతం త్రిగుణ్, ఝాన్సీలను నామినేట్ చేశాడు. చర్చల్లో చురుగ్గా పాల్గొనడం లేదని, సేఫ్ గేమ్ ఆడుతోందని ఝాన్సీపై రోహిత్ ఆరోపణలు చేశాడు. ఈ నామినేషన్ ప్రక్రియ రోహిత్, ఝాన్సీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇద్దరూ పరస్పరం ఘాటుగా వాదించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు విడుదల చేశారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా, తాజా సమాచారం ప్రకారం రెండో వారం నామినేషన్లలో పది మంది నిలిచారు. నామినేట్ అయిన వారిలో శాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రామ్ ప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముఖేష్, దేబ్జాని ఉన్నారు. కాగా సృష్టి, వంశీ, నరేష్, అమన్ ఈ వారం నామినేషన్ల నుండి సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement