Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల ఆక్రమణ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది: బండి సంజయ్

మన పత్రిక: ఒవైసీ కళాశాల చెరువు ఆక్రమణలో లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నిరుపేదల ఇళ్లను కూల్చడంలో చూపే ఉత్సాహాన్ని, స్పష్టంగా కనిపిస్తున్న ఈ భారీ ఆక్రమణలపై ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కంటిచూపు సమస్య ఉందా లేక ఎంఐఎం పార్టీతో ఉన్న రాజకీయ బంధం వల్ల ఇలా వ్యవహరిస్తోందా అని ఆయన నిలదీశారు.

రాజకీయ అవసరాల కోసం ఎఫ్‌టీఎల్ పరిధి మార్పు

కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఎఫ్‌టీఎల్ పరిధిని ఇష్టమొచ్చినట్లు మారుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు కంటి పరీక్షలు చేయించడానికి బీజేపీ కార్యకర్తలు ఉచిత శిబిరాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరీక్షల తర్వాత కూడా ఆక్రమణ కనిపించకపోతే, అది కంటి లోపం కాదని, పూర్తిగా రాజకీయ లోపమేనని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ప్రభుత్వం, ఆచరణలో మాత్రం పేదలకు ఒక న్యాయం, ఎంఐఎం నాయకులకు మరో న్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Advertisement
Advertisement