మన పత్రిక: తెలంగాణలో శనివారం అర్థరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షాలు కురిసి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలుచోట్ల వర్షం పడడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఇదిలా ఉండగా, రానున్న గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే హైదరాబాద్లోని ఉప్పల్, లింగంపల్లి, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని సూచించారు.
అర్ధరాత్రి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం

Advertisement