మన పత్రిక, రాజకీయం: గజ్వేల్లో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా దీనిని అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో విర్రవీగుతూ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే ప్రశ్నను లేవనెత్తారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యంగా మారాయని హరీశ్ రావు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేస్తూ, మరోవైపు దాడులకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యం అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించిన ఆయన, సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనల్లో నిమగ్నమై రాష్ట్ర పాలనను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులకు కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో హామీలు ఇచ్చి ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించిన హరీశ్ రావు, ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అణచివేతలకు, దాడులకు భయపడదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేసిన ఆయన, ఇలాంటి దాడులు ఆగకపోతే ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలే వీధుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
