మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ యాక్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) కేసులు 1845, ఈ-పెట్టీ కేసులు 1463, ఐపీసీ కేసులు 498, ఎస్ఎల్ఎల్ (SLL) కేసులు 84 ఉన్నట్లు స్పష్టం చేశారు.
కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను రాజీ మార్గంలో, చట్టబద్ధంగా పరిష్కరించుకోవడం ద్వారా ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయని ఎస్పీ సూచించారు. దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందేందుకు భవిష్యత్తులోనూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులను ఎస్పీ అభినందించారు.
