మన పత్రిక, సిద్దిపేట: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ కానుకగా మార్చి 22వ తేదీన ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలివిడత నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ పథకం కింద యాసంగికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా మార్చి 22న ఎకరం లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో తొలివిడత నిధులు జమ కానున్నాయి. ఆ తర్వాత విడతల వారీగా పంపిణీ చేసి, ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
యాసంగి సీజన్ ముగుస్తున్నా, ఎకరాకు అందజేసే రూ. 6,000 పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి మాసం నుంచి ప్రజాప్రతినిధులు నిధుల విడుదలపై ప్రకటనలు చేస్తున్నా అమలు కాలేదు. తాజాగా ఎట్టకేలకు ప్రభుత్వం కచ్చితమైన తేదీని ఖరారు చేయడంతో అన్నదాతలకు ఊరట లభించింది.
