మన పత్రిక, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ వ్యవస్థను తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు అమలు, ముందస్తు ఏర్పాట్లు, సాంకేతిక సదుపాయాలపై ఆయన సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ఈ పైలట్ ప్రాజెక్టును జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నారు. ఇందులో ఒక జీజీహెచ్, 4 ఏరియా ఆసుపత్రులు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 4 అర్బన్ పీహెచ్సీలు, 31 పీహెచ్సీలు, 19 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సంబంధించిన ఓపీ, ల్యాబ్, ఫార్మసీ తదితర పూర్తి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసి, ప్రత్యేకంగా ‘డిజిటల్ హెల్త్ కార్డు’ను జారీ చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ డిజిటల్ కార్డుల ద్వారా రోగి వైద్య చరిత్ర మొత్తం అందుబాటులో ఉండటంతో, వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి వీలవుతుందని మంత్రి దామోదర తెలిపారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేసి, రాష్ట్రవ్యాప్త అమలుకు సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆయన అధికారులకు సూచించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
