మన పత్రిక, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం కోసం ప్రత్యేకంగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం, ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం కూడా ఒక బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ‘అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత నిధులను మార్చి 13న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి ఈ సొమ్మును అందిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ముందుగానే మే 15వ తేదీన సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాబోయే ఉగాది పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, ‘ఇంద్ర ధనస్సు’ పేరుతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో గతంలో వినియోగదారులపై పడిన ‘ట్రూ అప్’ భారాలకు భిన్నంగా, తొలిసారిగా ‘ట్రూ డౌన్’ విధానాన్ని అమలు చేశామని వివరించారు. దీని ద్వారా 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధరను తగ్గిస్తూ రూ. 4,600 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
