మన పత్రిక వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువుపైనే ఓ విద్యార్థి చేయి చేసుకోవడం, అది కూడా చిన్న కారణానికే దాడికి పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో 12వ తరగతి ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా హాజరైన ఒక విద్యార్థిని, అక్కడ ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి “నన్ను ఇంట్లోనే ఎవరూ ఏమీ అడగరు, నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?” అంటూ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అందరూ చూస్తుండగానే ఆమె చెంపపై కొట్టి, నెట్టివేసి తరగతి గది నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటన జరిగిన రోజునే నిందితుడి తండ్రి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలికి, ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆ తర్వాత వ్యవహారం ముదిరింది. జనవరి 27న సదరు విద్యార్థి తన తండ్రి, మరో 15 నుంచి 20 మంది వ్యక్తుల బృందంతో కలిసి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు ఉపాధ్యాయురాలు ఆ పట్టణంలో ఒంటరిగా నివసిస్తుండటంతో, తమను ఎదిరిస్తే హాని తలపెడతామని ఆకతాయి మూక హెచ్చరించింది. దీంతో భయపడిన బాధిత ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందిస్తూ ప్రధాన నిందితుడైన 18 ఏళ్ల విద్యార్థితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన తీరును అర్థం చేసుకోవడానికి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా శుక్రవారం అతనికి బెయిల్ మంజూరైంది. అయితే తాను కేవలం క్షమాపణ చెప్పడానికే వెళ్లానని నిందితుడు వాదిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువుపై దాడి చేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల పెంపకంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
