మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ వాహనదారులకు ఊరటనిచ్చింది. ఇకపై కొత్త వాహనం కొన్న తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) కోసం ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. షోరూమ్‌లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా వెసులుబాటు కల్పించింది.
పాత పద్ధతికి స్వస్తి గతంలో వాహనం కొనుగోలు చేసినప్పుడు షోరూమ్‌లో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే చేసేవారు. అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహన యజమాని స్లాట్ బుక్ చేసుకుని ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై డీలర్ షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయనున్నారు. ఈ విధానం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా, ఇప్పుడు తెలంగాణలోనూ అందుబాటులోకి రానుంది.
15 రోజుల్లో కొత్త సాఫ్ట్‌వేర్ 2025 డిసెంబర్ 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, ఇది మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
వాహన్ సారథి పోర్టల్ కేంద్ర రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘వాహన్ సారథి’ పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తక్షణ అమలు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా 15 రోజుల్లోనే సేవలు ప్రారంభించనున్నారు.
