Chandrashekar Pole : గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చెందిన స్టూడెంట్ చంద్రశేఖర్ పోలెను యూఎస్ లోని హోస్టన్ లో ఓ దుండగుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఫోర్ట్ వర్త్ అనే గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న చంద్రశేఖర్ పై దుండగుడు హటాత్తుగా గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 28 ఏళ్ల చంద్రశేఖర్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు.
టెక్సాస్ కు చెందిన 23 ఏళ్ల రిచార్డ్ ఫ్లోరెజ్ ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే, అతడు ఎందుకు చంద్రశేఖర్ పై కాల్పులకు తెగబడ్డాడో మాత్రం తెలియలేదు. హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం యూఎస్ కి వచ్చి డెంటన్ లోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో డేటా అనాలిటిక్స్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్ లో చేరాడు. ఆరు నెలల క్రితమే తన డిగ్రీ పూర్తి కాగా, అక్కడే ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఖాళీగా ఉండకుండా గ్యాస్ స్టేషన్ లో పార్ట్ జాబ్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపించాలని అక్కడి అధికారులను వేడుకుంటున్నారు. అయితే, ఈ ఘటనతో ఒక్కసారిగా యూఎస్ లో ఉంటున్న ఇండియన్స్ ఉలిక్కిపడ్డారు. ఇండియన్స్ నే టార్గెట్ గా చేస్తూ యూఎస్ లో జరుగుతున్న దాడులపై ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

