Advertisement

నాని సినిమా ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ అదిరిపోయే డాన్స్

మన పత్రిక: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది పారడైజ్’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుకాగా, బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్న ఆయన, తనదైన శైలి నృత్యంతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా యాంకర్ సుమతో కలిసి ‘ఆశా నాగుల’ పాటకు రాఘవ్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సుమ చీర కొంగు పట్టుకుని తన సిగ్నేచర్ స్టెప్పులతో ఆయన చేసిన హంగామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తెలుగు ప్రేక్షకులకు రాఘవ్ జుయల్ కొత్త ముఖమే అయినప్పటికీ, హిందీ టెలివిజన్ రంగంలోనూ, బాలీవుడ్‌లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2009లో వచ్చిన ‘డాన్స్ ఇండియా డాన్స్’ మొదటి సీజన్ ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. తన అసాధారణ నృత్య రీతులు, స్లో-మోషన్ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్, ‘క్రాక్‌రోచ్’, ‘క్రొకోడైల్’ వంటి వినూత్న నృత్య శైలులతో బలమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.

Advertisement

డ్యాన్సర్‌గానే కాకుండా యాంకర్గా, నటుడిగా కూడా రాఘవ్ రాణిస్తున్నారు. 2014లో విడుదలైన ‘సోనాలి కేబుల్’ సినిమాతో ఆయన నటనారంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ ప్రాజెక్టులలో నటించారు. 2020 నాటి ‘అభయ్’ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ పాత్రలో నటించి తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. ఆ తర్వాత ‘కిల్’, ‘యుధ్ర’ వంటి చిత్రాలలో భిన్నమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమాతో రాఘవ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం ‘కింగ్’లో కూడా రాఘవ్ నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement