మన పత్రిక: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదేహి సంజీవలియ, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ ఏమిటంటే?
విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ కథలో బేకరీ నడిపే మేఘన (అమ్ము అభిరామి) రాత్రి పది గంటలైనా ఇంటికి తిరిగి రాదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి (గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీసులు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకపోవడంతో, కాబోయే అల్లుడు ఏసీపీ అర్జున్ (కౌశిక్) సహాయాన్ని కోరతాడు. అర్జున్ ఈ కేసు దర్యాప్తును చేపట్టి మేఘనతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించడం ప్రారంభిస్తాడు.
ఈ క్రమంలో కార్తీక్ (రామ్ కార్తీక్) అనే బైకర్ మేఘనను ఒకచోట దింపినట్లు పోలీసులు గుర్తిస్తారు. అయితే కార్తీక్ తనకు మేఘన తెలియదని చెబుతూ, తన పాత ప్రేయసి ఆద్య (వైదేహి సంజీవలియ) గురించి వివరిస్తాడు. కానీ, మేఘన ఫోన్ రికార్డుల ఆధారంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగినట్లు ఏసీపీ అర్జున్ గుర్తిస్తాడు. అసలు కార్తీక్ ఎందుకు అబద్ధం చెప్పాడు? మేఘనను ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ కథలో ఆకాష్ (అంకిత్ కొయ్య) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
సాధారణ మిస్టరీ థ్రిల్లర్ తరహాలోనే ఒక అమ్మాయి అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే పోలీసుల విచారణ, అనుమానితులు, మలుపులతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఇందులో జోడించిన భిన్నమైన ప్రేమకథ కథనానికి అదనపు బలాన్ని ఇచ్చింది. దర్యాప్తు సాధారణంగానే సాగినప్పటికీ, కొన్ని మలుపులు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తాయి. సినిమాను సుదీర్ఘంగా సాగదీయకుండా నేరుగా ప్రధాన కథలోకి తీసుకువెళ్లడం బాగుంది.
తొలి భాగంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, కార్తీక్ బ్రేకప్ ట్రాక్ మరింత బలంగా ఉండాల్సింది. విరామ మలుపు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ప్రారంభం నెమ్మదిగా సాగినప్పటికీ, డ్రగ్స్ కోణంలో దర్యాప్తు సాగే కొద్దీ కథనంలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం కాకపోయినా, ఏసీపీ అర్జున్ కేసును ఛేదించే విధానం ఆకట్టుకుంటుంది. తక్కువ రన్‌టైమ్ ఉండటం సినిమాకు కలిసొచ్చిన అంశం.
నటీనటుల పనితీరు
భగ్నప్రేమికుడిగా రామ్ కార్తీక్ తన పాత్రలో చక్కటి నటనను కనబరిచాడు. మేఘన పాత్రలో అమ్ము అభిరామి సహజంగా నటిస్తూ భావోద్వేగాలను బాగా పండించింది. ఏసీపీ అర్జున్‌గా కౌశిక్ దర్యాప్తు సన్నివేశాలను సమర్థవంతంగా నడిపించాడు. అంకిత్ కొయ్య పాత్ర నిడివి తక్కువైనా కథలో కీలకమైన మలుపునకు కారణమవుతుంది. మేఘన తండ్రిగా గోపరాజు రమణ తన అనుభవంతో మెప్పించగా, మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం
ఈ సినిమాకు ఆర్.ఆర్.ధ్రువన్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. పాటలు బాగుండటంతో పాటు నేపథ్య సంగీతం సస్పెన్స్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ జోనర్‌కు తగినట్లుగా ఉంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండటం వల్ల సినిమా సాగదీత లేకుండా సాగిపోతుంది. నిర్మాణ విలువలు సినిమా పరిమితులకు తగినట్లుగా ఉన్నాయి.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
