Advertisement

రామ్ చరణ్ ఇచ్చిన లాకెట్ కథ చెప్పిన శ్రీకాంత్ ఓదెల

మన పత్రిక: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాను ఎల్లప్పుడూ ధరించే హనుమాన్ లాకెట్ వెనుక ఉన్న భావోద్వేగ కథను వెల్లడించారు. ఈ లాకెట్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఇది ‘రంగస్థలం’ సినిమాతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు. ఇటీవల నటుడు రాఘవ్ జుయాల్‌తో జరిపిన సంభాషణలో లాకెట్ గురించి అడగగా శ్రీకాంత్ ఈ విషయాలను పంచుకున్నారు.

చెన్నైలో చిరంజీవి ప్రత్యేకంగా రెండు లాకెట్లను మాత్రమే చేయించారని శ్రీకాంత్ తెలిపారు. అందులో ఒకదాన్ని చిరంజీవి తన వద్ద ఉంచుకోగా, మరొకదాన్ని రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ధరించారు. ఆ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీకాంత్, కాస్ట్యూమ్ విభాగంలో కూడా బాధ్యతలు నిర్వహించారు. షూటింగ్ సమయంలో చరణ్ టీమ్‌తో కలిసి పనిచేసేవారు.

Advertisement

రంగస్థలం షూటింగ్ చివరి రోజున రామ్ చరణ్ తనను క్యారవాన్‌లోకి పిలిచి, ఆ లాకెట్‌ను తీసి తనకే ఇచ్చారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. చరణ్ ఆ లాకెట్‌ను ఎందుకు ఇచ్చారో తాను ఎప్పుడూ అడగలేదని, ఆప్యాయంగా ఇచ్చిన ఆ బహుమతికి ఎంతో భావోద్వేగానికి గురై ఇప్పటికీ దానినే ధరిస్తున్నానని చెప్పారు. ఇటీవల రామ్ చరణ్‌ను కలిసినప్పుడు ఈ లాకెట్ గురించి గుర్తుచేయగా, చరణ్ ఆ సంఘటనను గుర్తుతెచ్చుకుని సంతోషం వ్యక్తం చేశారని శ్రీకాంత్ పేర్కొన్నారు.

Advertisement