Advertisement

ఆడబిడ్డలకు క్షమాపణ కాంగ్రెస్ చెప్పేదాకా వదిలిపెట్టం: కేటీఆర్‌

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, ఈ దాడికి సీఎం రేవంత్‌రెడ్డే పూర్తిగా బాధ్యుడని ఆరోపించారు. రాష్ట్రంలో శాసనసభ కాస్తా కౌరవ సభలా, దుశ్శాసన పర్వంలా మారిందని విమర్శించారు.

డిస్ట్రక్షన్, డైవర్షన్ రాజకీయాలే రేవంత్‌కు తెలుసని, మహిళలపై జరిగిన దాడిని కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టమని, హోంమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలని, సీఎంను విమర్శిస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపై పార్టీలో ఆలోచిస్తామని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement