Advertisement

కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: హరీశ్ రావు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురంలో దివ్యాంగుల హక్కుల సాధన కోసం నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, పింఛన్ల పంపిణీలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని హరీశ్ రావు తెలిపారు. గతంలో రూ.500గా ఉన్న పింఛనును ఎనిమిదింతలు పెంచి రూ.4,016 చేశామని గుర్తుచేశారు. ఆసరా పింఛన్ల కింద ప్రభుత్వం మొత్తం రూ.54 వేల కోట్లు వెచ్చిస్తే, అందులో దివ్యాంగులకే రూ.10,300 కోట్లు అందించినట్లు తెలిపారు. అలాగే హౌసింగ్‌లో 5 శాతం, విద్యా ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు.

Advertisement

2017-18 సంవత్సరంలో దివ్యాంగుల చట్టాన్ని సమర్థంగా అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే ఉత్తమ అవార్డు లభించిందని హరీశ్ రావు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని పెంచకపోగా, ప్రతినెల ఇచ్చే పంపిణీ సమయాన్ని మార్చుతూ రెండు మూడు నెలల పింఛన్లను ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు.

Advertisement