Advertisement

అమ్మ జ్ఞాపకాలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన నటి ఈషా రెబ్బా

మన పత్రిక: తెలుగు సినీ నటి ఈషా రెబ్బా తమ నూతన గృహంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గృహప్రవేశ వేడుకలకు సంబంధించిన ఫొటోలను, భావోద్వేగపూరిత విశేషాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నూతన గృహప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ వ్రతం నిర్వహించిన దృశ్యాలు ఈ ఫొటోల్లో కనిపించాయి.

తన దివంగత తల్లి జ్ఞాపకార్థం ఈ నూతన గృహానికి ‘నాగేశ్వరీ నిలయం’ అని నామకరణం చేసినట్లు ఈషా రెబ్బా వెల్లడించారు. తన తండ్రి ఎంతో ప్రేమ, శ్రమతో ఈ ఇంటిని నిర్మించారని, ఆయన ఇప్పటికీ అమ్మను ఎంతగానో గుర్తుచేసుకుంటారో తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తల్లి పేరును ఇంటికి పెట్టడం ద్వారా ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తమతోనే ఉంటాయనే భావన కలుగుతుందని వివరించారు.

Advertisement

2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బా, ఆ తర్వాత అంతకు ముందు ఆ తర్వాత, బండిపోటు, అమి తుమి, దర్శకుడు, అవే, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రమణ్యపురం, రాగల 24 గంటల్లో, మామ మశ్చీంద్ర వంటి పలు చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంలో ఆమె చివరిగా కనిపించారు. సినిమాలతో పాటు పలు ఓటీటీ వెబ్ సిరీస్‌లలోనూ ఆమె నటిస్తున్నారు.

Advertisement