Advertisement

సాధిక్ ఖాన్ కేసులో పోలీసుల విచారణ వెలుగులోకి సంచలన విషయాలు

మన పత్రిక: కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి, అలాగే సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మరణం వెనుక ఉన్న కారణాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్‌ను ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు.

జగదీష్ రెడ్డి మృతికి విష ప్రయోగమే కారణమని, సాధిక్ ఖాన్ తమను బెదిరిస్తూ ఆస్తులను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించాడని సౌజన్య రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో జగదీష్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని భావించినప్పటికీ, లేఖలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని వైద్య రికార్డులు, ఇతర ఆధారాలను పోలీసులు పునఃపరిశీలిస్తున్నారు.

Advertisement

తన కుమారుడి షూటింగ్ శిక్షణ ద్వారా సౌజన్య కుటుంబంతో పరిచయం పెంచుకున్న సాధిక్ ఖాన్, ఆ తర్వాత వారి వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. పరారైన సమయంలో తన మొబైల్ ఫోన్లను వదిలేసి వెళ్లిన సాధిక్‌ను, ఆగస్టు 22న మీరట్ నాచేంది పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకుంది.

షూటింగ్ అకాడమీకి పిల్లలను పంపే ఇతర మహిళలతో కూడా సాధిక్ ఖాన్ ఇదే రీతిలో వ్యవహరించాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధిక్ ప్రవర్తన నచ్చక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అకాడమీకి పంపడం మానేశారన్న కథనాల ఆధారంగా కూడా విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం లభ్యమైన డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటా ఆధారంగా కేసులోని నిజానిజాలను తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement