మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ల ధరలను సవరిస్తూ నూతన జీఓ విడుదల చేసింది. ఈ కొత్త వర్గీకరణ విధానం వల్ల పలు థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ వర్గాల్లో చర్చ మొదలైంది.
కొత్త నిబంధనల ప్రకారం, డోల్బీ 7.1 లేదా అంతకంటే మెరుగైన ఆడియో వ్యవస్థతో పాటు 2కే లేదా 4కే ప్రొజెక్షన్ సదుపాయాలు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ. 300 వరకు టికెట్ ధర నిర్ణయించుకోవడానికి అనుమతి లభించింది. రాష్ట్రంలోని మెజారిటీ సింగిల్ స్క్రీన్లు ఈ ప్రత్యేక వర్గం పరిధిలోకి వస్తాయని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని దాదాపు మూడింట రెండు వంతుల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ సాంకేతిక అర్హతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా తక్కువ ధరలకే వినోదం లభిస్తుందనే ఉద్దేశంతో ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే ఇక్కడ కూడా మల్టీప్లెక్స్‌లకు సమానంగా టికెట్ ధరలు పెరిగితే, సాధారణ ప్రేక్షకులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ ధరల పెంపు వల్ల థియేటర్ యజమానులు, పంపిణీదారుల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది. రాబోయే వారాల్లో పలు భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో, ఈ నూతన టికెట్ ధరల ప్రభావం పూర్తిస్థాయిలో వెల్లడికానుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
