Advertisement

భోగాపురం విమానాశ్రయం ప్రారంభం: భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం

మన పత్రిక, విజయనగరం: విజయనగరం జిల్లాలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరిట నిర్మించిన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు.

విమానాశ్రయ నిర్మాణానికి భూములు, గృహాలు కేటాయించిన రైతులకు గౌరవసూచకంగా ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం మండలంలోని ముంజేరు, సవరవిల్లి, ఏ రావివలస, రావాడ, కంచెరు, కవులువాడ, గూడెపువలస గ్రామాలకు చెందిన 403 మంది రైతులు భూములు ఇవ్వగా, 1,600 మంది ఇళ్లు కోల్పోయారు. భూములు, ఇళ్లు రెండూ ఇచ్చిన వారు 200 మందికి పైగా ఉన్నారు. ఈ బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందించింది.

Advertisement

రైతులకు ప్రత్యేక హాస్పిటాలిటీ, హైదరాబాద్‌కు ఉచిత ప్రయాణం

ప్రారంభోత్సవ సభా ప్రాంగణంలో విఐపి గ్యాలరీలోని ముందు వరుసలో రైతులకు ఆసనాలు కేటాయించి, ప్రత్యేక హాస్పిటాలిటీ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రైతులకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి, ప్రత్యేక విమానంలో వారిని హైదరాబాద్‌ తీసుకెళ్తారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయి పరిస్థితులను రైతులకు నేరుగా చూపించనున్నారు.

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ద్వారా ఏడాదికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణిస్తారు అని అధికారులు అంచనా వేశారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య సుమారు 5 కోట్లకు చేరుకుంటుందని, దీంతో భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతులు పెరిగి ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Advertisement