మన పత్రిక, కామారెడ్డి: వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింక్‌లు పంపి పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ నేతృత్వంలో రూరల్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రామన్, రామారెడ్డి ఎస్సై మురళితో కూడిన ప్రత్యేక బృందాలు ఈ విచారణ పూర్తి చేశాయి. కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రామారెడ్డి మండలానికి చెందిన భూక్య నవీన్ అలియాస్ నరేష్, భూక్య ప్రవీణ్‌లు నిందితులుగా తేలినట్లు ఎస్పీ చెప్పారు.
వెబ్‌సైట్ డేటాతో కమిషన్ మోసాలు
ప్రధాన నిందితుడు భూక్య నవీన్ విదేశాల్లో పనిచేస్తున్న సమయంలో Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన డేటా, మొబైల్ నంబర్లను సేకరించాడని పోలీసులు తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ప్రవీణ్‌తో కలసి వాట్సాప్ ద్వారా లింకులు పంపి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. బాధితులకు యూజర్ ఐడీలు క్రియేట్ చేసి, తమ యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు జమ చేయించుకునేవారని, ప్రతి డిపాజిట్‌పై వారికి 5 శాతం కమిషన్ దక్కేదని దర్యాప్తులో గుర్తించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయని ఎస్పీ వెల్లడించారు.
అరెస్టయిన నిందితుల నుంచి రూ.15 వేల నగదు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇతర రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, రెట్టింపు లాభాల పేరుతో వచ్చే గుర్తుతెలియని లింకులను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సీవైబీఈఆర్సీఆర్ఐఎమ్ఈ.జీఓవీ.ఐఎన్ (cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయాలని కోరారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
