మన పత్రిక: జెన్ జీ యువత, మహిళలను ఉద్దేశించి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ విమర్శించారు. తన వ్యాఖ్యలతో సమాజంలో భావోద్వేగాలను దెబ్బతీసినందుకు గాను బాధితులైన యువతకు, మహిళలకు ఆమె బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు సంయమనం, బాధ్యత వహించాలని నారాయణ సూచించారు. సమాజంలో విభేదాలను పెంచేలా, ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కంగన మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
గతంలో నిరసనకారులను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’ అనే వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించి, ఆ వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడాన్ని నారాయణ అభినందించారు. తప్పును గుర్తించి దిద్దుకునే ఇటువంటి వైఖరి న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని, ఉన్నతమైన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
