Advertisement

ఓటర్ల నమోదులో బిఎల్ఏల పాత్రపై తెలంగాణ కాంగ్రెస్ ప్రశంసలు

మన పత్రిక, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏ) చూపుతున్న ప్రతిభను తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ అభినందించింది. అర్హత కలిగిన మిగిలిన పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ నేతలకు సూచించింది. న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రాతిపదిక అయిన ఓటు హక్కును ప్రతీ పౌరుడికి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాబోయే పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు, పట్టభద్రుల ఓటర్ల నమోదు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు వివరించారు. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపి, ఒక్కో స్థానానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను పార్టీ నాయకత్వానికి సమర్పిస్తారని పేర్కొన్నారు.

Advertisement

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తెలంగాణవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) ఆగస్టు 3 వరకు ఇంటింటికీ తిరిగలి సమాచారం సేకరిస్తారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 10న విడుదల చేయనున్నారు.

Advertisement