Advertisement

లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మన పత్రిక, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రూరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి నేటిబొట్టు తరుణ్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న తరుణ్, ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు.

అందిన సమాచారం ప్రకారం, కళాశాలలో ఒక మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్ తరుణ్ మార్కులను తరగతిలోని మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ అందరి ముందూ అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. 434 మార్కులు వస్తే గొప్పవాడివి అయిపోయావా అని, మంత్రి కుమారుడివి అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తూ తరగతి గదిలో చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్, లెక్చరర్‌ను ప్రశ్నించి రెండు రోజుల పాటు కళాశాలకు వెళ్లడం మానేశాడు.

Advertisement

మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుణ్ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి తప్ప అవమానించకూడదని, సున్నితమైన మనస్తత్వం ఉన్నవారిని అవమానాలు ఎంతగా గాయపరుస్తాయో ఆ లెక్చరర్ తెలుసుకోవాలని అందులో పేర్కొన్నాడు. సంబంధిత లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని, ఈ విషయం అందరికీ తెలియాలని కోరాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. బుధవారం రోజున బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టి సదరు కాంట్రాక్ట్ లెక్చరర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement