మన పత్రిక: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధి అంశాలపై ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ డివిజన్ పరిధిలోకి కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, దోర్నకల్-మణుగూరు, మోతుమర్రి-విష్ణుపురం, కాజీపేట-వంగపల్లి రైల్వే మార్గాలను చేర్చాలని ప్రతిపాదించారు. దాదాపు 2,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఈ డివిజన్ ఏర్పాటు చేయడం కార్యాచరణపరంగా సాధ్యమేనని, ఇది తెలంగాణ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
సుమారు 151 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కొత్తపల్లి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే మనోహరాబాద్-సిద్దిపేట సెక్షన్ పూర్తి కాగా, మిగిలిన సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి భాగాల్లో పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 511 కోట్ల వాటా, భూసేకరణ ఆలస్యం కారణంగా ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తారని, అలాగే సిరిసిల్ల ప్రధాన టెక్స్‌టైల్ కేంద్రంగా ఉందని గుర్తు చేస్తూ, ఈ రెండు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలోని టైర్-2 నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు. వరంగల్‌లో ఇండియాఏఐ సెంటర్ లేదా ఇండియాఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో ఎస్‌టీపీఐ సెంటర్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంజూరు చేయాలని సూచించారు. ఐటీ పెట్టుబడులను హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్రమంత్రికి సమర్పించిన ప్రతిపాదనల్లో కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని పూర్తిగా విద్యుదీకరించాలని కోరారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి నిర్మించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో హై లెవల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
