Advertisement

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన కెటిఆర్

మన పత్రిక, హైదరాబాద్: కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. జులై 28న ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల విస్తరణతో పాటు టియర్-2 నగరాల్లో ఐటీ రంగానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు.

దక్షిణ మధ్య రైల్వే పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2,000 ట్రాక్ కిలోమీటర్ల పరిధితో కాజీపేట డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ప్రతిపాదించారు. ఇందులో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మనుగూరు, మోతుమర్రి-విష్ణుపురం, కాజీపేట-వంగపల్లి సెక్షన్లను చేర్చవచ్చని సూచించారు. గుంటూరు డివిజన్ 900 కిలోమీటర్లు, విజయవాడ, గుంతకల్ డివిజన్లు 2,200 కిలోమీటర్ల చొప్పున పనిచేస్తున్నందున, కాజీపేట డివిజన్ ఏర్పాటు నిర్వహణ పరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యసాధ్యాలను పరిశీలించాలని కూడా కోరారు.

Advertisement

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ

మనహరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కొత్తపల్లి 151 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట వరకు 76 కిలోమీటర్ల మార్గం ఇప్పటికే పూర్తయి 2023 అక్టోబర్ 3న ప్రారంభమైందని, అయితే మిగిలిన 75 కిలోమీటర్ల పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రూ.511 కోట్లు విడుదల చేయకపోవడం, భూసేకరణ పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్ల నుంచి రూ.2,780 కోట్లకు పెరిగిందని వెల్లడించారు.

సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేర్చాలని, మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్-కమ్-రోడ్ బ్రిడ్జిని మంజూరు చేయాలని, ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఐటీ రంగానికి కేంద్ర మద్దతు

వరంగల్‌లో ఇండియాఏఐ సెంటర్ లేదా డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో ఎస్‌టీపీఐ సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మంజూరు చేయాలని కేటీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని తన నివేదికలో పేర్కొన్నారు.

Advertisement