Advertisement

ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడుతున్న పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో పంటల రక్షణకు అత్యవసర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూలై నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 69 శాతం లోటు నమోదైందని, రానున్న నెలల్లో కూడా దాదాపు 40 శాతం వరకు వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు.

ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఈ వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న 122 మండలాలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పంటలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ నీటి పారుదల మార్గాలు, నీటి యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.

Advertisement

రాష్ట్రంలో పాడి రైతులకు ఇబ్బంది కలగకుండా పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వచ్చే ఐదు నెలలకు సరిపడా పశుగ్రాస నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement