Advertisement

జీవో 25 సవరణకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి పోరాట పిలుపు

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు

Advertisement

విషయం: తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక విద్య పరిరక్షణ – జీవో నెం.25 సవరణ కోసం ఉమ్మడి పోరాటానికి విజ్ఞప్తి.

గౌరవనీయులైన సంఘ నాయకులారా, నమస్కారములు.

ప్రభుత్వ ప్రాథమిక విద్య భవిష్యత్తు గురించి మనమందరం ఒకసారి గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేడు మనం మౌనంగా ఉంటే, రేపు ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాపాడే అవకాశం కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య కాదు… ఇది లక్షలాది పేద, గ్రామీణ, బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం.

ప్రాథమిక పాఠశాల బలంగా ఉంటేనే ఉన్నత పాఠశాల బలంగా ఉంటుంది. పునాది బలహీనంగా ఉంటే ఎంత గొప్ప భవనం నిర్మించినా నిలబడదు. అదే విధంగా ప్రాథమిక విద్య బలహీనపడితే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 16,400 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో దాదాపు 5,000 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే, 7,000 పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలోని సుమారు 12,000 పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి.

ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం

ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు తరగతులకు సంబంధించిన 18 సబ్జెక్టులను బోధించాలి. అదే సమయంలో 15 సబ్జెక్టుల వర్క్‌బుక్‌లను దిద్దాలి. ప్రభుత్వం అందిస్తున్న నోట్‌బుక్‌లను పరిశీలించాలి. ప్రధానోపాధ్యాయునిగా పరిపాలనా బాధ్యతలు, సమావేశాలు, ఆన్‌లైన్ నమోదులు, నివేదికలు, పర్యవేక్షణ వంటి అనేక పనులు నిర్వహించాలి.

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుంది?

ఒక ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నా… ప్రసూతి సెలవుకు వెళ్లినా… ఇన్-సర్వీస్ బి.ఎడ్. శిక్షణకు హాజరైనా… మొత్తం పాఠశాల బాధ్యత ఒక్క ఉపాధ్యాయుడిపైనే పడుతుంది. అప్పుడు అన్ని తరగతుల పిల్లలను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధించడం తప్ప మరో మార్గం ఉండదు.

ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు “ఈరోజు హోంవర్క్ ఏమిచ్చారు?” అని అడిగితే పిల్లలు చెప్పే సమాధానం…

“ఈరోజు ఒక్క టీచర్ మాత్రమే వచ్చారు… అందుకే హోంవర్క్ ఇవ్వలేదు.”

ఈ సమాధానం ఒక కుటుంబానికే కాదు… ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వినిపిస్తున్న ఒక హెచ్చరిక.

ఇలాంటి పరిస్థితులను చూస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి వెనుకడుగు వేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఆ తగ్గిన సంఖ్యనే కారణంగా చూపుతూ జీవో నెం.25 ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు.

ఇది ఒక విషవలయంగా మారింది.

ఉపాధ్యాయులు తగ్గితే విద్యార్థులు తగ్గుతున్నారు.
విద్యార్థులు తగ్గితే మళ్లీ ఉపాధ్యాయులను తగ్గిస్తున్నారు.

ఈ చక్రాన్ని ఇప్పుడు ఆపకపోతే రేపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది.

ప్రతి సంవత్సరం ఉన్నత పాఠశాలల్లో LEP (Learning Enhancement Programme) నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? కారణం ప్రాథమిక ఉపాధ్యాయుల సామర్థ్యం కాదు; ప్రాథమిక స్థాయిలో అవసరమైనంత మంది ఉపాధ్యాయులు లేకపోవడమే. ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో ఐదు తరగతులకు నాణ్యమైన విద్య అందించడం ఏ ఉపాధ్యాయుడికైనా అసాధ్యమైన పని.

అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత గురించి, జీవో నెం.25 వల్ల జరుగుతున్న అన్యాయం గురించి, విద్యార్థుల భవిష్యత్తుపై పడుతున్న ప్రభావం గురించి అన్ని సంఘాలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ కనిపించడం లేదు.

గౌరవనీయులైన సంఘ నాయకులారా,

చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్ తరాల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం అలాంటి కీలక దశలో మనం ఉన్నాం.

కాబట్టి మనమందరం ఉమ్మడిగా ప్రభుత్వానికి ఈ క్రింది డిమాండ్లను వినిపించాలి.

  • జీవో నెం.25ను తక్షణమే సవరించాలి.
  • ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీస అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలి.
  • తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి సబ్జెక్టు వారీ ఉపాధ్యాయ వ్యవస్థను ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలి.
  • విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని నాణ్యమైన విద్యకు అనుగుణంగా పునర్నిర్ణయించాలి.
  • ఒక్కరు, ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలకు వెంటనే అదనపు పోస్టులను మంజూరు చేయాలి.

గౌరవనీయులైన నాయకులారా,

ఈరోజు మనం ప్రాథమిక విద్యను కాపాడలేకపోతే, రేపు ప్రభుత్వ విద్యను కాపాడలేం. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి అడుగు పెట్టకపోతే, ఉన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థులు ఉండరు. అందువల్ల ఈ సమస్యను కేవలం ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యగా కాకుండా, తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడకు సంబంధించిన అత్యవసర అంశంగా గుర్తించి అన్ని సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ప్రభుత్వంపై నిర్మాణాత్మక ఒత్తిడి తీసుకురావాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

“ప్రాథమిక విద్యను కాపాడటం అంటే ప్రభుత్వ విద్యను కాపాడటమే.
ప్రభుత్వ విద్యను కాపాడటం అంటే పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే.”

ఇట్లు,

కలవల శంకర్
ఎస్.జి.టి., అదిలాబాద్
మొబైల్: 9440750178.

Advertisement