Advertisement

ఈపీఎఫ్ ఖాతాల్లోకి 8.25 శాతం వడ్డీ జమ ప్రారంభం

మన పత్రిక: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ (EPF) ఖాతాల్లో 8.25 శాతం వడ్డీని జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటుకు ఆమోదం తెలిపిన అనంతరం, దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది చందాదారుల ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ దఫాల వారీగా వడ్డీని జమ చేస్తుండటంతో కొందరికి ఇప్పటికే ఖాతాల్లో పడగా, మరికొందరికి రాబోయే రోజుల్లో అప్‌డేట్ కానుంది.

ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ సభ్యులు పలు మార్గాలను ఉపయోగించవచ్చు. EPFO మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌ సందర్శించి, యుఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి పాస్‌బుక్ చూడవచ్చు. ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా కూడా సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి వివరాలు పొందవచ్చు. ఇవే కాకుండా, UAN నంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా నిబంధనల ప్రకారం ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా కూడా తాజా బ్యాలెన్స్ వివరాలను ఫోన్‌లో పొందవచ్చు.

Advertisement

వడ్డీ జమ కాకపోతే ఆందోళన అవసరం లేదు

ఒకవేళ మీ ఖాతాలో వడ్డీ మొత్తం ఇంకా కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది. వడ్డీ జమ ప్రక్రియ దశలవారీగా జరుగుతున్నందున అందరి ఖాతాల్లో అప్‌డేట్ కావడానికి కొంత సమయం పడుతుంది. లేట్ అయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి వడ్డీ లభిస్తుందని, లెక్కింపు ముందే జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ విరాళాలు ఉన్న క్రియాశీల ఈపీఎఫ్ ఖాతాదారులందరూ ఈ 8.25 శాతం వడ్డీకి అర్హులు. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, నేరుగా ఖాతాకే జమ అవుతుంది.

Advertisement