మన పత్రిక: గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ రాబోయే 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్లోబరీనా సంస్థలో తనకు ఎటువంటి వాటాలు, ఆర్థిక ప్రయోజనాలు లేదా బినామీ లబ్ధి లేవని వెల్లడించారు. అంతేకాకుండా ఆ సంస్థకు సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడంలో కూడా ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తన రాజకీయ ప్రతిష్ఠను, ప్రజాదరణను దెబ్బతీసే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అత్యున్నత పదవిలో ఉండి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమని కేటీఆర్ పేర్కొన్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
