Advertisement

రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ హెచ్చరిక

మన పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనలో అవకతవకలకు పాల్పడిన గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ కంపెనీ అంటూ సీఎం చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ లీగల్ నోటీసులు పంపుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తమ బిఆర్ఎస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయకూడదని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గట్లుగా వ్యవహరించాలని, పరీక్షల పేపర్ లీకేజీలు మరియు ఫలితాల నిర్వహణపై అబద్ధాలు ప్రచారం చేస్తూ సీఎం పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement