Advertisement

ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఆక్వా మరియు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్, ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను వివరించారు. ముఖ్యంగా ఫిష్‌మీల్, ఫిష్ ఆయిల్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, అంతర్జాతీయ ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశీయంగా చేపల పొట్టు కొరతను అధిగమించేందుకు ఎగుమతులపై నియంత్రణ విధించాలని, అలాగే జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న అధిక ఉత్పత్తి వ్యయం, తక్కువ మార్కెట్ ధరలు, వ్యాధుల వంటి సమస్యలపై విధానపరమైన సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సంబంధిత శాఖలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement