Advertisement

సీతక్కపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

మన పత్రిక: కాంగ్రెస్ నాయకురాలు సీతక్కపై నమోదైన క్రిమినల్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2021 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ సీతక్క, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని, పోలీసుల అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270 మరియు విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 51(బి) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కింది కోర్టులో విచారణ కొనసాగుతుండటంతో, సీతక్క హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టులో వాదనలు

తనపై నమోదైన కేసు చట్టబద్ధం కాదని సీతక్క పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదుకు సంబంధిత అధికారి నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు ఉండాలని, కానీ అది లేదని వాదించారు. అలాగే, విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 60 ప్రకారం అధికారం కలిగిన వ్యక్తి ఫిర్యాదు లేదని, సెక్షన్లు 269, 270 వర్తించడానికి తగిన ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలించిన జస్టిస్ సుజన, కేసును కొనసాగించడానికి తగిన చట్టపరమైన ఆధారం లేదని నిర్ధారిస్తూ కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.

Advertisement
Advertisement