Advertisement

ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

మన పత్రిక: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరియు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వద్ద క్లెయిమ్ చేయని అన్‌క్లెయిమ్డ్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిధులను ఇతర ఏ అవసరాలకు మళ్లించే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో స్పష్టం చేశారు. ఐఆర్‌డిఏఐ (IRDAI) మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, 10 ఏళ్లకు పైగా క్లెయిమ్ కాకుండా ఉన్న బీమా నిధులను ‘సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్’కు బదిలీ చేస్తారని, వాటిని మరే ఇతర పనులకు వాడే యోచన లేదని ఆయన పేర్కొన్నారు.

నిధుల వివరాలు

మార్చి 31, 2026 నాటికి ఎల్‌ఐసీ వద్ద రూ.7,318.50 కోట్ల క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇందులో పాలసీదారులకు చెందిన రూ.5,564.55 కోట్లు మరియు వాటిపై వచ్చిన రూ.1,753.95 కోట్ల వడ్డీ ఆదాయం కలిసి ఉన్నాయి. అదే సమయంలో ఈపీఎఫ్‌ఓ ఖాతాల్లో రూ.9,330.56 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నిధులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారులను గుర్తించి వారి క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓలు నిరంతరం కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

Advertisement

అమలు చేస్తున్న చర్యలు

ఎల్‌ఐసీ తన వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేయని నిధులను వెతుక్కునే సదుపాయాన్ని కల్పించింది. అలాగే ఏజెంట్లు, ఎస్‌ఎంఎస్‌లు మరియు ఉత్తరాల ద్వారా ఖాతాదారులను సంప్రదిస్తోంది. మరోవైపు ఈపీఎఫ్‌ఓ ఆధార్ ఆధారిత కేవైసీ (KYC) ద్వారా ఇన్-ఆపరేటివ్ ఖాతాలను వర్గీకరిస్తోంది. రూ. 1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉండి ఆధార్ వెరిఫై అయిన ఖాతాల్లోని డబ్బును ఎటువంటి దరఖాస్తు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టినట్లు మంత్రి వివరించారు.

Advertisement