Advertisement

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: లూనాను ఢీకొన్న వాహనం

మన పత్రిక, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. జోగిపేట నుండి సంగారెడ్డి వైపు తన లూనా వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతుడిని కొండాపూర్ గ్రామానికి చెందిన నరసింహ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారిక కారు డ్రైవర్ అశోక్ గౌడ్ తండ్రి అని సమాచారం. సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

నిజాయితీ చాటుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది

ప్రమాదం జరిగిన సమయంలో మృతుడి వద్ద రూ. 12.27 లక్షల నగదు ఉంది. ఈ నగదును హైవే పెట్రోలింగ్ సిబ్బంది మనోజ్, శ్రావణ్, బాలరాజు, సాయి మరియు బాలమణి గుర్తించి, అత్యంత నిజాయితీతో పోలీసులకు అప్పగించారు. సిబ్బంది ప్రదర్శించిన ఈ నిజాయితీని స్థానికులు మరియు పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement