Advertisement

వైఎస్ఆర్సీపీ ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ప్రారంభం

మన పత్రిక: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను అధికారికంగా ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలను నేరుగా నాయకత్వంతో అనుసంధానించేందుకు, వారి అభిప్రాయాలను ఎటువంటి భయం లేకుండా పంచుకునేందుకు ఈ డిజిటల్ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో తమ పార్టీకి మద్దతు తెలిపే వారి కంటెంట్‌ను తొలగించడం, గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. వీటిని ఎదుర్కొనేందుకు సొంత వేదిక అవసరమని భావించి ఈ యాప్‌ను తెచ్చామన్నారు. ఇది పార్టీకి చెందిన సొంత వేదిక కావడంతో, బయటి శక్తులు ఎవరూ కార్యకర్తల సమాచారాన్ని తొలగించే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్తను, నాయకుడిని ఈ యాప్ అనుసంధానిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

యాప్ ద్వారా సేవలు

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసు వేధింపుల వంటి విషయాలను కార్యకర్తలు నేరుగా యాప్ ద్వారా తెలియజేయవచ్చని జగన్ వివరించారు. పార్టీ సమావేశాలు, ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాల లైవ్ ఫీడ్లను కూడా ఇందులోనే చూడవచ్చు. భవిష్యత్తులో కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వారు యాప్‌లో పోస్ట్ చేయడం ద్వారా పార్టీ నుంచి తక్షణ స్పందన పొందేలా దీనిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం పోలీసు వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులను నమోదు చేస్తున్న డిజిటల్ డైరీని ఈ సూపర్ యాప్‌తో అనుసంధానించనున్నారు. దీనివల్ల బాధితులైన కార్యకర్తలు నేరుగా తమ ఫిర్యాదులను యాప్ ద్వారానే పంపవచ్చు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీపై వచ్చే విమర్శలను ఎదుర్కోవడంతో పాటు, ఎవరూ ఆపలేని విధంగా ఈ సూపర్ యాప్‌ను సిద్ధం చేశామని జగన్ స్పష్టం చేశారు.

Advertisement