Advertisement

అమెరికాలో భారతీయుడిపై కత్తితో దాడి: 15 సార్లు పొడిచిన నిందితుడు

మన పత్రిక: అమెరికాలోని ఉటా రాష్ట్రంలో వెస్ట్ వ్యాలీ సిటీలో ఉన్న వ్యాలీ సిటీ మాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉద్యోగిగా పనిచేస్తున్న సయ్యద్ సోహైలుద్దీన్ అనే భారతీయుడిపై 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సోమవారం మధ్యాహ్నం మాల్‌లోకి వచ్చిన నిందితుడు సోహైలుద్దీన్‌ను అతని పేరు, స్వస్థలం మరియు మతపరమైన వివరాల గురించి ప్రశ్నించిన అనంతరం, తన వద్ద ఉన్న కత్తితో 15 సార్లు పొడిచాడు. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా 13 మంది భారతీయులు మృతి చెందారని, ఈ దాడులను నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

స్థానికుల సాయంతో నిందితుడి అరెస్టు

ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకున్నారు. నిందితుడి చేతిలోని కత్తిని లాగేసి పోలీసులకు అప్పగించగా, ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో లార్సన్‌కు తలపై గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోహైలుద్దీన్‌ను ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన ట్రామా విభాగంలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం నుండి సోహైల్ బయటపడటం అద్భుతమని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

నిందితుడిపై కేసు నమోదు

పోలీసుల విచారణలో నిందితుడు లార్సన్ బాధితుడి మత విశ్వాసాల కారణంగానే లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై హత్యాయత్నం మరియు నిషేధిత ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు కేసులు నమోదు చేసి సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు. నిందితుడి తీవ్రవాద భావజాలం దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వరాదని అధికారులు కోర్టును కోరారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ కూడా స్పందించింది.

Advertisement