Advertisement

నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా: మెండోరా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్

మన పత్రిక, నిజామాబాద్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మెండోరా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) సదానంద్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమాలకు పాల్పడిన ఆర్ఐపై వేటు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరుతో ఇసుక తరలింపునకు అనుమతులు పొంది, ఆ నిల్వలను దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా మాత్రమే అనుమతులు ఉండగా, సదానంద్ వాటిని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీనిపై లబ్ధిదారులను విచారించగా, తమకు ఇసుక అందలేదని వెల్లడైంది.

Advertisement

విచారణకు ఆదేశించిన కలెక్టర్

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని మైనింగ్ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక రవాణాలో అక్రమాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement