మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: Andhra Pradesh aqua sector Crisis ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్లకు విడివిడిగా లేఖలు రాశారు.
అమెరికా విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను భారం పడుతోందని లేఖలో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఏటా జరిగే రూ. 25,000 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు నిలిచిపోయి, 2.5 లక్షల రైతు కుటుంబాలతో పాటు 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతర్జాతీయ అస్థిరత వల్ల దేశీయంగా రొయ్యల ధరలు 20 నుండి 25 శాతం పడిపోయాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల మేతపై కిలోకు రూ. 9 తగ్గించిందని, విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 1.50 లకే అందిస్తోందని గుర్తుచేశారు.
సంక్షోభ నివారణకు గాను అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపాలని, రష్యా, ఈయూ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని సీఎం ప్రతిపాదించారు. అలాగే, భారత సాయుధ దళాల రోజువారీ ఆహారంలో రొయ్యలను చేర్చాలని, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని రూ. 1 లక్షకు పెంచాలని కోరారు. ప్రత్యేక శీతలీకరణ రైలు సౌకర్యం కల్పించడంతో పాటు, ఏపీలో ‘ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ’ ఏర్పాటుకు రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
- బండి భగీరథ్ పోక్సో కేసు.. నేడు కోర్టులో కస్టడీ పిటిషన్
- Petrol Diesel Price Hike | మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వారం రోజుల్లోనే రెండోసారి
- May 19 Gold Rates | ఈరోజు బంగారం ధరలు
- గురుకులాలు, హాస్టళ్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతి నెలా డైట్ ఛార్జీలు
- AP Inter Hall Tickets 2026 : సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల..
