Advertisement

క్యాతన్‌పల్లి బీఆర్ఎస్ కైవసం

మన పత్రిక: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలుమార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు శనివారం నిర్వహించగా, బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. చైర్మన్‌గా సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా సరిత (సీపీఐ) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 7, ఒక ఇండిపెండెంట్‌కు ఒక స్థానం లభించింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్, ఆయన కుమారుడు, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10కు చేరింది. దీంతో కూటమిలోని ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు పొందితే చైర్మన్ పీఠం దక్కించుకోవచ్చనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో మంత్రి వివేక్ తీవ్రంగా ప్రయత్నించారని, ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు కూడా కారణమయ్యారనే విమర్శలు వినిపించాయి. బీఆర్ఎస్ నేతలు మంత్రి వివేక్‌పై ప్రలోభాలు, ఒత్తిళ్ల ఆరోపణలు కూడా చేశారు.

ఇంత హైడ్రామా జరిగినా చివరకు కాంగ్రెస్‌కు మున్సిపల్ పీఠం దక్కకపోవడం పార్టీకి ప్రతిష్టాపరమైన దెబ్బగా మారింది. ముఖ్యంగా మంత్రి వివేక్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌లోనే చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గ పరిధిలోనే పీఠం సాధించలేకపోవడం ఆయనపై విమర్శలకు దారితీసింది.ఈ పరిణామాలు రాబోయే కేబినెట్ విస్తరణపై కూడా ప్రభావం చూపే అవకాశముందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
Advertisement